Telegram Group

Teaching & Govt Job Telegram Group

Guntur Kaaram Review గుండెను పిండేసే మదర్ సెంటిమెంట్.. 10 ఏళ్లలో మహేష్ ఇలా ఎన్నడూ.. గుంటూరు కారం రివ్యూ

గుంటూరు కారం మూవీ రివ్యూ

నటీనటులు: మహేష్ బాబు - రమ్యకృష్ణ - శ్రీలీల - ప్రకాష్ రాజ్ - జయరాం - మీనాక్షి చౌదరి - మురళి శర్మ - జగపతిబాబు - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - రఘుబాబు - ఈశ్వరీ రావు - రాహుల్ రవీంద్రన్ తదితరులు

సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస

నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ

రచన- దర్శకత్వం: త్రివిక్రమ్

అతడు.. ఖలేజా తర్వాత మహేష్ బాబు - త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

🔺

వెంకట రమణ (మహేష్ బాబు) చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవుతాడు. అతడి తండ్రి (జయరాం) ఒక హత్య కేసులో జైలుకు వెళ్తే.. తల్లి (రమ్యకృష్ణ) మరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. తన తండ్రి సొంతూరు గుంటూరులో మేనత్త మావయ్యల దగ్గర పెరిగిన రమణ.. కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. అలాంటి సమయంలో తల్లి నుంచి రమణకు పిలుపు వస్తుంది. కానీ ఆ పిలుపు ఆమె ఆస్తి నుంచి వాటా లేదు అని సంతకం పెట్టించుకోవడానికి అని తెలుస్తుంది. మరి రమణ సంతకం పెట్టాడా.. ఈ పంచాయతీ ఎక్కడిదాకా వెళ్ళింది.. ఈ తల్లి కొడుకుల బంధం ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ.

కథనం- విశ్లేషణ:

అతడు సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యుండకపోవచ్చు. కానీ అది ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఒక క్లాసిక్. ఖలేజా సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యుండొచ్చు. కానీ అది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న చిత్రం. ఇదీ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఉన్న ఘన చరిత్ర. అయితే తామిద్దరం ఎంతో ఇష్టపడి.. కష్టపడి.. ఒక తపనతో చేసిన సినిమాలకు సరైన ఫలితం రాలేదని ఈ ఇద్దరు ఏమైనా ప్రేక్షకుల మీద అలిగారో ఏమో తెలియదు.. ఈసారి గుంటూరు కారం అనే సగటు కమర్షియల్ సినిమాను అందించారు. ఈ సినిమాకు గుంటూరు కారం లాంటి మామూలు టైటిలా.. మహేష్ ఏంటి ప్రతి పోస్టర్లోనూ బీడీతోనే కనిపిస్తున్నాడు.. త్రివిక్రమ్ సినిమాలో కూర్చి మడతపెట్టి లాంటి లిరిక్స్ ఎలా పెట్టారు... మేకింగ్ దశలో ఇలాంటి ప్రశ్నలు వేసుకున్న వాళ్ళందరికీ తెరమీద బొమ్మ చూశాక విషయం బోధపడుతుంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు.. సినిమాలో ఉన్న కంటెంట్ కు తగ్గట్లే అన్ని అలా సమకూరాయి అని అర్థమవుతుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే హిస్టరీలోకి వెళ్లి ఏదేదో ఊహించుకోకుండా సగటు కమర్షియల్ సినిమాకు ప్రిపేర్ అయితే గుంటూరు కారం ఓకే అనిపిస్తుంది. అంతకుమించి ఆశిస్తే కష్టం.

ఒక గొప్ప వంటకం చేద్దామని ప్రయత్నించి విఫలమైతే.. ఆ తర్వాత ఎందుకు వచ్చిన ప్రయోగాలు.. సింపుల్ గా. అలవాటైన ఒక ఉప్మా లాంటిదేదో చకచకా వండేసి వడ్డించేద్దాం అన్న చందంగా తయారయింది గుంటూరు కారం పరిస్థితి. ఉప్మా తిన్నా కడుపు నిండుతుంది కానీ ఆ టేస్ట్ గురించి గొప్పగా చెప్పుకోం. అలాగే రెండు ముప్పావు గంటల్లో ఏదో అలా టైం పాస్ అయితే చేయించేస్తుంది గుంటూరు కారం. కానీ షో అవ్వగానే ఏముంది ఇందులో ప్రత్యేకత అనిపిస్తుంది. త్రివిక్రమ్ ఇప్పటికే తీసిన అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురములో, అజ్ఞాతవాసి సినిమాల్లోని ఫ్యామిలీ డ్రామానే ఇటు అటు తిప్పి గుంటూరు కారం తీసినట్లే అనిపిస్తుంది తప్ప ఇందులో కొత్తదనం అంటూ ఏమీ కనిపించదు. తెర మీద కనిపించే విజువల్స్.. ప్రాపర్టీస్.. పాత్రలు.. మాటలు.. ఇలా అన్ని మరీ అలవాటై నట్లుగా అనిపించాయంటే త్రివిక్రమ్ మిక్సీకి ఎక్కువ పని పెట్టేశాడు అని అర్థం.

🔺

అయితే అలవాటైన సీన్లనే చూస్తున్నా.. ఎంటర్టైన్మెంట్ డోస్ లో మాత్రం త్రివిక్రమ్ ఏమీ తక్కువ చేయలేదు. మహేష్ ను అభిమానులు కోరుకునే ఎనర్జిటిక్- ఎంటర్టైనింగ్ పాత్రలో చూపించి.. దానికి తన మార్కు వెటకారం.. చమత్కారం జోడించడంతో చాలా సీన్లను ఆ పాత్ర సేవ్ చేసేసింది. అదిరిపోయే లుక్స్.. స్క్రీన్ ప్రెజెన్స్.. టిపికల్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మహేష్ విజయవంతం అయ్యాడు. ముఖ్యంగా ప్రతి మార్గం వరకు మహేష్ షో.. త్రివిక్రమ్ సెన్సాఫ్ హ్యూమర్ బాగానే వర్కౌట్ అయ్యాయి. విధ్వంసం చూపిస్తా అన్న ప్రకాష్ రాజ్ కు.. ఆ పదానికి అర్థం ఏంటో తెలియచెప్పే ఆరంభ సన్నివేశంతో గుంటూరు కారం బాగా టేకాఫ్ అయింది. కథపరంగా అంత ఎంగేజింగ్ గా లేకపోయినా.. మహేష్- శ్రీలీల- వెన్నెల కిషోర్ కాంబినేషన్లో కామెడీ కూడా బాగానే పండించాడు. ఇక హీరో ఎలివేషన్ సీన్లు.. పాటలు.. ఫైట్లు కూడా ఓకే అనిపిస్తాయి.

ప్రథమార్ధం వరకు గుంటూరు కారం పైసా వసూల్ అనిపిస్తుంది. కానీ అసలు కథను చెప్పాల్సిన ద్వితీయార్థంలో మాత్రం త్రివిక్రమ్ నిరాశపరిచాడు. తల్లి కొడుకుల బంధం నేపథ్యంలో ఎమోషన్ ను సరిగా పండించలేకపోయాడు. ఇది మరీ బోరింగ్ వ్యవహారం లాగా అనిపిస్తుంది. ఒక సీన్లో ఈశ్వరరావు పాత్ర హైదరాబాద్ దగ్గర ఉందని వెళ్లడం రావడం ఇదే పనా అంటూ విసుక్కుంటుంది మహేష్ దగ్గర. దాదాపుగా ప్రేక్షకుల ఫ్రస్టేషన్ కూడా అలాగే ఉంటుంది. క్యారెక్టర్లు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లడం. హైదరాబాద్ నుంచి గుంటూరుకు రావడం.. ఇదేనా సినిమా అనిపిస్తుంది. జిలెటిన్ బాబ్జి.. దాసు అనే రెండు పాత్రలను పెట్టి బలవంతంగా ఇరికించిన యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తాయి. పూర్తిగా డీవియేషన్లలా అనిపించే ఆ ఎపిసోడ్లు సినిమాను సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి కల్పిస్తాయి. కథ పట్ల నెమ్మదిగా ఆసక్తి తగ్గిపోతుంది. కథలో కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలిశాక మహేష్ త్రివిక్రమ్ కలిసి చేయాల్సిన సినిమానా ఇది అనిపిస్తుంది. ఈ మాత్రం కథకు ఇంత పెద్ద సెటప్పా అన్న ఫీలింగ్ కలుగుతుంది. కుర్చీ మడతపెట్టి పాట.. క్లైమాక్సులో చిన్న ట్విస్టు.. కొన్ని డైలాగులు తప్పిస్తే ద్వితీయార్థంలో మెరుపులు పెద్దగా లేవు. మహేష్ ఫ్యాక్టర్.. కమర్షియల్ హంగుల వల్ల సినిమా ఏదోలా నడిచిపోతుంది కానీ మహేష్ త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో.. త్రివిక్రమ్ మహేష్ లాంటి హీరోతో చేయాల్సిన సినిమా మాత్రం కాదిది.

నటీనటులు:

మహేష్ గత కొన్నేళ్లలో చాలా వరకు కామ్ అండ్ మూడీ క్యారెక్టర్లే చేశాడు. అయితే అభిమానులు మహేష్ నుంచి కోరుకునేది జోష్ ఉన్న పాత్రలు. అతను ఎంత అల్లరి చేస్తే అంత ఎంటర్టైన్మెంట్. స్టేజ్ మీద, బయట పొడి పొడిగా మాట్లాడుతూ బిడియస్తుడిలా కనిపించే మహేష్ ఇతనేనా అనిపించేలా తెర మీద చెలరేగిపోయాడు. తను కనిపించే తొలి నిమిషం నుంచి.. చివరి నిమిషం వరకు పూర్తిగా ఎంటర్టైన్ చేశాడు. తన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ.. అభిమానులనే కాదు సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయి. మహేష్ తర్వాత నటనలో ఎక్కువ మార్కులు పడేది ప్రకాష్ రాజ్ కే. వయసు మళ్ళిన పాత్రలో ఆయన తను చేసే రొటీన్ క్యారెక్టర్ల నుంచి వైవిధ్యం చూపించాడు. రమ్యకృష్ణ ఎక్కువగా మాట్లాడకుండా కళ్ళతోనే నటించింది. రావు రమేష్ చివర్లో వచ్చే ఒక్క సీన్లో తన ప్రత్యేకత చాటుకున్నారు. హీరోయిన్ శ్రీలీల క్యూట్ అనిపిస్తుంది కానీ.. మహేష్ పక్కన చిన్న పిల్లలా అనిపించి.. అంతగా సూట్ కాలేదు. తన డ్యాన్సులు మాత్రం సూపర్. మీనాక్షి పేరుకే రెండో హీరోయిన్. ఆమెకి ఏమాత్రం ప్రాధాన్యం లేని చిన్న సహాయ పాత్ర ఇచ్చారంతే. వెన్నెల కిషోర్ ఓ మోస్తరుగా నవ్వించాడు. జగపతిబాబుకి మరీ సిల్లీ పాత్ర ఇచ్చారు. జయరాం, రఘు బాబు, ఈశ్వరీ రావు తమ తమ పరిధిలో బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

తమన్ సంగీతం నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. ఒక కమర్షియల్ సినిమాకు సూటయ్యే పాటలు, స్కోర్ ఇచ్చాడు. కానీ సంగీత పరంగా త్రివిక్రమ్ తో అతను ఇంతకు ముందు చేసిన సినిమాలకు ఇది దగ్గరగా కూడా వెళ్లదు. మనోజ్ పరమహంస కెమెరా పనితనం బాగా సాగింది. విజువల్ గా సినిమా రిచ్ గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. ఇక త్రివిక్రమ్ రచయితగా, దర్శకుడిగా తను నెలకొల్పిన ప్రమాణాలను అందుకోలేక పోయాడు. కొన్ని సీన్లు, మాటల్లో పదును చూపించినా కథ విషయంలో ఆయన ఒక మూసలో పడిపోయాడు అనిపిస్తుంది. దర్శకుడిగా కూడా ఆయన నిరాశపరిచాడు.

చివరగా:  గుంటూరు కారం.. మహేష్ మాస్.. త్రివిక్రమ్ మిస్

రేటింగ్: 2.5/5

Ads Right 1

Ads Right 2

в